: అసోంలో బీజేపీ విజయానికి పనిచేసిన పంచ సూత్రాలు
ఈశాన్య రాష్ట్రాల్లో అందులోనూ అసోంలో బీజేపీ సాధించిన ఘన విజయం సునాయాసంగా దక్కింది ఎంత మాత్రం కాదు. దీని వెనుక పంచ సూత్రాలు కీలక పాత్ర పోషించినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సర్బానంద సోనోవాల్ ను ఎంపిక చేయడంతోనే బీజేపీ మొదటి అడుగు విజయవంతంగా వేసింది. ఎందుకంటే, సోనోవాల్ కు స్వరాష్ట్రంలో విద్యార్థి సంఘాల నాయకుడిగా యువతలో మంచి పేరుంది. పైగా రాష్ట్ర అంశాలపై ఆయనకు చక్కటి అవగాహన కూడా ఉంది. అందుకే కేంద్ర క్రీడల మంత్రిగా ఉన్న సోనోవాల్ ను మోదీ, అమిత్ షా ఏరికోరి అసోం సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. ఇది ఫలించింది. అలాగే, ప్రాంతీయ పార్టీలతో జతకట్టి నడవడం కూడా కమలానికి ఊపిరిలూదింది. అసోం గణపరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ తో బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. కోక్రాఝుర్, సమీప ప్రాంతాలలో బీపీఎఫ్ కు మంచి పట్టుంది. స్థానిక అంశాలపై ఫోకస్ చేయడం బీజేపీ విజయంలో మరో కీలకాంశం. స్థానిక అంశాలు, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని మోదీ, షా కార్యకర్తలకు ముందుగానే మార్గ నిర్దేశం చేశారు. బంగ్లాదేశ్ నుంచి వలసలు, భారత్, బంగ్లాదేశ్ సరిహద్దును మూసివేయడం కీలక అంశాలుగా పనిచేశాయి. ఈ రెండూ తమకు ప్రాముఖ్య అంశాలుగా సోనోవాల్ గురువారం విజయం అనంతరం మరోసారి చెప్పడం కూడా గమనార్హం. ఇక, మోదీ ప్రచారం కూడా కలసివచ్చింది. లోక్ సభ ఎన్నికల సమయంలో 14 స్థానాలకు గాను సగం బీజేపీకే దక్కిన విషయం తెలిసిందే. ఇక, అసోంలోని కార్బి వర్గానికి, బోడోలకు గిరిజనులుగా హోదా కల్పిస్తామని ప్రధాని మోదీ ప్రకటించడం కూడా కలసివచ్చింది. అలాగే, ఢిల్లీ పోలీసు పోస్టుల్లో ఈశాన్య రాష్ట్రాల వారినీ నియమించుకోవాలని తాను ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పడం సానుకూల ఫలితాలను ఇచ్చింది.