: కృష్ణా జిల్లాలోనే కాదు నల్లగొండలోనూ అమరావతి... రూపు దిద్దుకున్న బుద్ధవనం
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లాలోనే కాదు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ వద్ద కూడా పర్యాటకులు అమరావతిలోని బౌద్ధ మహాస్తూపాన్ని చూసేయొచ్చు. దక్షిణ భారత్ లోనే మొదటి స్థానంలో నిలబడేలా ఈ బౌద్ధ మహా స్తూప నిర్మాణపనులు చకచకా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అక్కడ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుద్ధవనం ప్రాజెక్టు అనేక హంగులను అద్దుకుని సిద్ధమైంది. 279 ఎకరాల్లో ఈ బుద్ధవనాన్ని నిర్మిస్తున్నారు. గతంలో శాతవాహనుల కాలంలో రాజధానిగా విరాజిల్లిన అమరావతిలా రూపుదిద్దుకుంటూ బుద్ధవనం ప్రాజెక్టు ముందుకు సాగుతోంది. ఎటుచూసినా పచ్చదనాన్ని వెదజల్లే మొక్కలతో పాటు బౌద్ధశిల్పాలు, మ్యూజియం పర్యాటకులను ఆకర్షించేలా కనిపిస్తున్నాయి. దీని నిర్మాణానికి ఇప్పటివరకు రూ.36 కోట్లు ఖర్చుచేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందేలా బుద్ధవనాన్ని తీర్చిదిద్దుతామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఈరోజు బుద్ధజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ధ్యాన కేంద్రాలు, ఆశ్రమాలు ఇక్కడ వెలిశాయి. సాంచి, సారనాథ్, అజంతలో కనిపించే అద్భుత స్తూపాల నమూనాలు ఇక్కడ చూడొచ్చు. బోధిసత్వ వనం, ఆచార్య నాగార్జునవనం, బౌద్ధమతానికి చెందిన గాంధార, ఫణిగిర చాడలకు చెందిన పాలసేన శిల్పాలు, పంచలోహ విగ్రహాలు, అజంత చిత్రాలు పర్యాటకులను ఆకర్షించనున్నాయి. సిద్ధార్థుడి జీవిత విశేషాలను తెలియజెప్పేలా స్తూపాలను ఏర్పాటు చేశారు. ఇంకా మరెన్నో విశేషాలతో బుద్ధవనం రూపుదిద్దుకుంది.