: ఎగ్జిట్ పోల్స్ తప్పవుతాయని ముందుగానే ఊహించిన లాలూ ప్రసాద్ యాదవ్!
"గుర్తుంచుకోండి... బీహార్ లో ఎన్నికల అనంతరం అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువైంది. వాస్తవ ఫలితాలకు ఏ ఒక్క సంస్థ కూడా కనీసం దగ్గరకు రాలేకపోయింది. 19వ తేదీ వరకూ వేచి చూడండి" సరిగ్గా రెండు రోజుల క్రితం పాట్నాలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్య ఇది. బీహార్ విషయంలో ఎగ్జిట్ పోల్స్ తప్పయ్యాయని, తమిళనాడులో సైతం అదే జరగవచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయి. అత్యధిక ఎగ్జిట్ పోల్స్ తమిళనాట డీఎంకే అధికారంలోకి వస్తుందని అంచనాలు వేసి తలకిందులయ్యాయి. ఒక్క టైమ్స్ నౌ - సీఓటర్స్, తమిళనాడులోని లోకల్ చానళ్లు మాత్రమే జయలలిత గెలుస్తుందని వెల్లడించాయి. ఎన్నికల్లో మహిళలు అత్యధికంగా ఓటు హక్కును వినియోగించుకోవడం, అది కూడా పోలింగ్ నాడు వర్షం తగ్గిన తరువాత, చివరి రెండు గంటల్లో మహిళలు పోలింగ్ కేంద్రాలకు వెల్లువలా రావడంతో వారిలో అత్యధికుల ఓట్లు అన్నాడీఎంకేకు పడ్డట్టు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఇక మిగతా రాష్ట్రాల మాటెలా ఉన్నా, తమిళనాడు విషయంలో లాలూ అంచనా నిజం కావడం గమనార్హం.