: 'ఇడ్లీ సాంబార్' ప్రభావాన్ని అంచనా వేయలేకపోయిన ఎగ్జిట్ పోల్స్!
ఒకసారి అధికారంలో ఉన్న పార్టీకి మరోసారి అధికారం ఇచ్చే సంస్కృతి లేని తమిళనాడు ఓటర్లు ఈ దఫా అనూహ్యమైన తీర్పిచ్చేలా కనిపిస్తున్నారు. తమిళనాడులో ఎన్నికలు జరిగిన 232 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఫలితాల సరళి వెల్లడవుతుండగా, జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే 132 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ స్థానాల్లో గెలిస్తే చాలు, జయలలిత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టే. ఇదే సమయంలో డీఎంకే 95, పీఎంకే 4, ఇతరులు ఒక్క స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక సరిగ్గా మూడు రోజుల క్రితం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో అత్యధిక సంస్థలు జయలలితకు ఓటమి తప్పదని, కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే అధికారంలోకి రానుందని వెల్లడించాయి. తీరా ఇప్పుడు ఫలితం తారుమారవుతోంది. తమిళనాడులో జయలలిత పేదల కోసం ప్రారంభించిన పలు పథకాలు చూపిన ప్రభావాన్ని అంచనా వేయడంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన కంపెనీలు విఫలమైనాయని చెప్పుకోవచ్చు. నిత్యమూ అమ్మ క్యాంటీన్లలో రూ. 3 చెల్లించి సాంబార్ రైస్, రూ. 1 చెల్లించి ఇడ్లీలు తింటున్న రిక్షా కార్మికుల నుంచి ఐటీ ఉద్యోగుల వరకూ వేసిన ఓట్లు ఈ ఎన్నికల్లో జయలలితకు ఎంతో ప్లస్ అయ్యాయి. ఎన్నికల ఫలితాలను ఆమెకు అనుకూలం చేశాయి. నిత్యమూ వేలాది మంది అమ్మ క్యాంటీన్లలోని భోజనంతో కడుపు నింపుకుంటుండగా, వీరంతా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. సాంబార్ రైస్, ఇడ్లీలు మాత్రమే కాదు, రూ. 5కే పాలక్ రైస్, కర్డ్ రైస్ వంటి ఆహార పదార్థాలను సైతం అమ్మ క్యాంటీన్లు అందిస్తుండటంతో పేదల కడుపు నిత్యమూ నిండుతోంది. జయలలిత అందిస్తున్న చౌక అహారం తిన్నవారు తమ అన్నదాతను ఓటేసి ఆశీర్వదించినట్టు ఈ ఫలితాల సరళి చెబుతోంది. ఇదే విషయాన్ని సరిగ్గా అంచనా వేయని ఎగ్జిట్ పోల్ సంస్థలు, ప్రభుత్వంపై వచ్చే సగటు వ్యతిరేకత, ఇటీవలి వరదలు వంటి వాటిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని అంచనాలు విడుదల చేసి పప్పులో కాలేశాయని చెప్పొచ్చు.