: ఎంబీఏ విద్యార్థిని కోసం రెండు గ్రూపుల గొడవ, పథకం ప్రకారం దాడులు!
ఒక అమ్మాయి కోసం రెండు గ్రూపుల విద్యార్థులు పథకం ప్రకారం దాడులు చేసుకున్న ఘటన హైదరాబాదు, బంజారాహిల్స్ పరిధిలో కలకలం రేపింది. ఇరు వర్గాలూ ఒకరిపై ఒకరు ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కేసులు పెట్టిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తార్నాక ప్రాంతానికి చెందిన అనురాగ్, బంజారాహిల్స్ రోడ్ నెం. 11లోని అమిటి ఎంబీఏ కాలేజీలో బీబీఏ విద్యను అభ్యసిస్తున్నాడు. ఇదే కాలేజీలో చదువుకుంటున్న ఓ అమ్మాయిని, నిత్యమూ మాసబ్ ట్యాంక్ కు చెందిన మన్సూర్ అలీఖాన్ అనే యువకుడు తన బైక్ పై ఎక్కించుకుని వెళుతుంటాడు. తమ కాలేజీలో చదువుతున్న అమ్మాయిని తీసుకెళ్లడం బాగాలేదని అనురాగ్ వాదనకు దిగడంతో గొడవ ప్రారంభమైంది. ఆ అమ్మాయిని తీసుకువెళ్లేందుకు వచ్చిన అలీఖాన్ పై అనురాగ్ తన స్నేహితులతో దాడి చేసి కొట్టడంతో వివాదం ముదిరింది. ఆ తర్వాత అలీఖాన్ తన స్నేహితులు 20 మందితో కలిసి అనురాగ్ పై దాడికి రాగా, విషయం తెలుసుకున్న అనురాగ్ బ్యాచ్ వారిపై ప్రతిదాడికి సిద్ధమైంది. ఇంకేముంది, ఒక గ్రూపును మరొకరు తరుముకుంటూ వీధుల్లో పడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 8 వరకూ వచ్చారు. ఈలోగా ఎవరో పోలీసులకు ఫోన్ చేయడంతో, హుటాహుటిన వచ్చిన వారు విద్యార్థులందరినీ అదుపులోకి తీసుకున్నారు. కేసులు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.