: బెంగాల్లో తృణమూల్ ప్రభంజనం!... కనీస పోటీ ఇవ్వలేకపోయిన సీపీఎం!
పశ్చిమ బెంగాల్ ను దాదాపు 25 ఏళ్లకు పైగా ఏకబిగిన పాలించిన వామపక్ష పార్టీ సీపీఎం ఐదేళ్ల క్రితం కోలుకోలేని దెబ్బ తిన్నది. దీదీగా జనం పిలుచుకునే మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చేతిలో సీపీఎం మట్టి కరిచింది. అయితే ఈ దఫా అయినా సత్తా చాటుదామనుకున్న సీపీఎం నేతల ఆశలపై దీదీ నీళ్లు చల్లారు. సీపీఎంకే కాకుండా కేంద్రంలో అధికార బీజేపీకి కూడా గట్టి షాకిస్తూ నేటి ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ లో దీదీ సత్తా చాటారు. మొత్తం 294 సీట్లలో 211 స్థానాలకు పైగా ఆ పార్టీ ఆధిక్యం సాధించింది. దీదీ సాధిస్తున్న ఈ విజయం అక్కడ ప్రభంజనమనే చెప్పొచ్చు. ఏళ్ల తరబడి ఆ రాష్ట్రాన్ని పాలించిన సీపీఎంకు కనీసం రెండో స్థానం కూడా దక్కే అవకాశాలు లేవు. సీపీఎం 32 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ పార్టీ అంతకంటే అధికంగా 38 సీట్లలో ఆధిక్యంలోకి వచ్చింది.