: పాలేరు బైపోల్స్ ఫలితం నేడే!... విజయంపై ధీమాగా గులాబీ దళం!
ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం నేడు వెల్లడి కానుంది. నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు మధ్యాహ్నానికి ముందే పూర్తి కానుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి హఠాన్మరణంతో పాలేరుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. చనిపోయిన సిట్టింగ్ సభ్యుడి కుటుంబానికే ఆ సీటును ఏకగ్రీవంగా ఇచ్చేయాలన్న సంప్రదాయానికి తిలోదకాలిచ్చిన అధికార పార్టీ టీఆర్ఎస్... తన అభ్యర్ధిగా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బరిలోకి దించింది. అధికార పార్టీ వైఖరిని నిరసిస్తూ మిగిలిన అన్ని విపక్షాలు రాంరెడ్డి సతీమణి సుచరితారెడ్డిని బలపరచాయి. మొన్న జరిగిన పోలింగ్ లో 90 శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. ఇక ప్రచారంలో దూసుకెళ్లిన టీఆర్ఎస్ పార్టీ... పాలేరులో గెలుపు తమదేనన్న ధీమాతో ఉంది. మరోవైపు అన్ని పార్టీలు కలిసి బలపరచిన సుచరితారెడ్డికి భారీగానే ఓట్లు పడ్డాయని, గెలుపు తమదేనని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది.