: ఐదుగురు సీఎంల భవితవ్యం తేలేది నేడే!... మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం!


ఐదుగురు ముఖ్యమంత్రుల భవిష్యత్తు నేడు తేలిపోనుంది. నేటితో వారి సీఎం గిరీ ముగుస్తుందా? లేక మరో ఐదేళ్ల పాటు వారి పాలన కొనసాగుతుందా? అన్న విషయం నేటి మధ్యాహ్నం 2 గంటల్లోగా తెలిసిపోతుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం సహా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్ఛేరి అసెంబ్లీకి ఇటీవలే ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు ఓట్ల లెక్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపులో ఉదయం 11 గంటలయ్యేసరికే ఆయా రాష్ట్రాల్లో ప్రజల మొగ్గు ఎవరి వైపు అన్న విషయం తేలిపోనుంది. మధ్యాహ్నం 2 గంటలకు దాదాపుగా ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఎగ్జిట్ పోల్స్ లో మిశ్రమ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లోనూ ఆయా పార్టీలు ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఆ రాష్ట్రాల సీఎంలుగా ఉన్న మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్), జయలలిత (తమిళనాడు), ఊమెన్ చాందీ (కేరళ), తరుణ్ గొగోయ్ (అసోం), రంగసామి (పుదుచ్ఛేరి)లు మరింత ఆసక్తిగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఐదుగురిలో ఒక్క మమతా బెనర్జీ మినహా ఏ ఒక్కరికి ఎగ్జిట్ పోల్స్ లో పూర్తి స్థాయి అనుకూల ఫలితాలు రాకపోవడమే ఇందుకు కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News