: పోలవరం వేదికగా మరో దీక్ష చేపడతాం... చంద్రబాబుకి కేసీఆర్ అంటే భయం: జగన్
ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నీళ్ల కోసం అన్ని రకాలుగా పోరాడతామని, పోలవరం వేదికగా మరో దీక్ష చేపడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కర్నూలు జిల్లాలో మూడు రోజులుగా కొనసాగించిన దీక్షను విరమించిన అనంతరం ఆయన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ అక్రమంగా ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతే గోదావరిని నమ్ముకున్న ఏపీ రైతుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. నోటుకు ఓటు కేసులో కేసీఆర్ కేసు పెడతారనే భయంతో చంద్రబాబు భయపడిపోతున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబుకి కేసీఆర్ అంటే భయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై మోదీకి ఫిర్యాదు చేస్తే కేసీఆర్ కేసు పెడతాడనే భయం చంద్రబాబులో ఉందని ఆయన ఆరోపించారు. ‘ఢిల్లీలో తెలంగాణ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేస్తారేమోనని అనుకున్నాం. కానీ.. అక్రమ ప్రాజెక్టులను చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేద’ని ఆయన అన్నారు. ఢిల్లీకి వెళ్లి ప్రశ్నించలేని సీఎం మనకెందుకు? అని ఆయన వ్యాఖ్యానించారు. మీరు చేపట్టే ప్రాజెక్టులకు సీడబ్యూసీ అనుమతి ఉందా..? రివర్ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు అనుమతి ఉందా..? అని ఆయన తీవ్ర స్థాయిలో కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.