: హరీశ్‌రావు వ్యాఖ్యలను ఖండించిన దేవినేని ఉమా.. అనుమతులు ఉంటే ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చని వ్యాఖ్య
అన్ని అనుమతులూ ఉంటే ఏ రాష్ట్రమైనా ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నిన్న చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. విజయవాడలో దేవినేని మీడియాతో మాట్లాడుతూ.. రాయచూరు కలెక్టరుకు కర్నూలు కలెక్టర్ లేఖ రాశారంటూ హరీశ్‌రావు నిన్న పేర్కొన్న అంశాన్ని దేవినేని ఖండించారు. హరీశ్ రావు ఆ లేఖను మీడియా ముందు పెట్టాలని ఆయన సవాలు విసిరారు. అన్ని అనుమతులూ ఉంటే తెలంగాణే కాదు, ఏ రాష్ట్రమయినా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంచితే, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కర్నూలులో చేస్తోన్న దీక్షపై స్పందించిన దేవినేని ఉమా.. ‘జగన్ దీక్షతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం కలుగుతుంద’ని ప్రశ్నించారు. తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ దీక్షకు దిగారని ఆయన ఆరోపించారు.