: ఆత్మహత్యా? ప్రమాదమా?... ఆర్థిక ఇబ్బందుల్లో తనీష్ తండ్రి!
టాలీవుడ్ నటుడు తనీష్ తండ్రి వర్ధన్ మరణం ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడి వుండవచ్చని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. మణికొండలోని వెస్ట్రన్ ప్లాజాను ఈ ఉదయం పరిశీలించిన పోలీసు వర్గాలు, ఆయన పొరపాటున కిందకు పడే అవకాశాలు లేవని భావిస్తున్నట్టు తెలిపాయి. ఆయనకు అప్పులున్నాయని, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఓ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ఇటీవల వర్ధన్ కొన్ని ఆస్తులను విక్రయించారని కూడా సమాచారం. గత రాత్రి వెస్ట్రన్ ప్లాజాలో ఆరో అంతస్తు నుంచి వర్ధన్ కింద పడి తీవ్రగాయాలతో మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఫ్లోర్ రెయిలింగ్ మూడు అడుగులకన్నా ఎత్తుగా ఉండటంతో, ప్రమాదం జరిగే అవకాశాలు తక్కువని పోలీసులు భావిస్తున్నారు. కాగా, తమ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేవని వర్ధన్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.