: మీ అబ్బ సొత్తనుకుంటున్నారా?... 'గాంధీ' పేర్లపై విరుచుకుపడ్డ రిషి కపూర్
కాంగ్రెస్ పాలనలో వివిధ ప్రాంతాలు, కట్టడాలకు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లను పెట్టడంపై బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ తీవ్రంగా స్పందించారు. "వివిధ ఆస్తులకు ఉన్న గాంధీ కుటుంబ సభ్యుల పేర్లను మార్చండి. బాంద్రా వర్లీ సీలింక్ రోడ్డుకు లతా మంగేష్కర్ లేదా జేఆర్డీ టాటా పేరు పెట్టండి. భవనాలు రోడ్లేమైనా మీ అబ్బ సొత్తనుకుంటున్నారా?" అని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలోని అక్బర్ రోడ్డు పేరును మహారాణా ప్రతాప్ రోడ్డుగా మార్చాలని కేంద్రమంత్రి వీకే సింగ్ చేసిన ప్రతిపాదనపై ఆయన స్పందించారు. "ఢిల్లీలోని వీధుల పేర్లను మార్చినప్పుడు, కాంగ్రెస్ హయాంలో ఆస్తులకు, రోడ్లకు పెట్టిన పేర్లను ఎందుకు మార్చకూడదు? చండీగఢ్ లో రాజీవ్ గాంధీ పేరెందుకు? దేశానికి, సమాజానికి సేవ చేసిన వారి పేర్లు పెట్టాలి గానీ, ప్రతిదానికీ గాంధీ-నెహ్రూ కుటుంబం పేర్లెందుకు?" అంటూ తన సామాజిక మాధ్యమ ఖాతా ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఢిల్లీ విమానాశ్రయానికి ఇందిరా గాంధీ పేరెందుకని ప్రశ్నించిన ఆయన, మహాత్మా గాందీ పేరు లేదా భగత్ సింగ్, అంబేద్కర్ల పేర్లో లేకపోతే తన పేరో పెట్టాలని అన్నారు. ప్రస్తుత రాజకీయ నేతలకన్నా దేశానికి తన తండ్రి రాజ్ కపూర్ ఎక్కువే చేశాడని చెప్పుకొచ్చారు.