: సొంత గూటికి అమర్ సింగ్!... రాజ్యసభకు నామినేట్ చేసిన సమాజ్ వాదీ పార్టీ
జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత అమర్ సింగ్ మళ్లీ తన సొంత గూటికి చేరుకున్నారు. 2009 సాధారణ ఎన్నికలకు ముందు సమాజ్ వాదీ పార్టీ అమర్ సింగ్ ను బహిష్కరించింది. ఆ తర్వాత సొంత పార్టీ పెట్టుకున్న అమర్ సింగ్... ఎదురుదెబ్బ తగలడంతో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ)లో చేరారు. ఆ తర్వాత చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న అమర్ సింగ్ నిన్న తన సొంత పార్టీ... సమాజ్ వాదీ పార్టీలో చేరిపోయారు. నాడు బహిష్కరణ వేటు పడ్డ అమర్ సింగ్ తిరిగి పార్టీలోకి చేరగానే రెడ్ కార్పెట్ పరచిన ఎస్పీ... వెనువెంటనే ఆయనను పెద్దల సభ రాజ్యసభకు నామినేట్ చేసింది. వచ్చే నెల రాజ్యసభకు జరగనున్న ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీకి ఏడు స్థానాలు దక్కే అవకాశాలున్నాయి. ఈ ఏడింటికి అభ్యర్థులను ప్రకటించిన ఎస్పీ... వాటిలో ఓ స్థానాన్ని అమర్ సింగ్ కు కేటాయించింది.