: మ్యాచ్ మధ్యలో దర్జాగా ఫీల్డర్ దగ్గరకి వచ్చిన శునకరాజం!
విశాఖపట్టణంలోని పోతిన మల్లయ్యపాలెంలోని డాక్టర్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పూణే బ్యాటింగ్ ప్రారంభించిన తొలి ఓవర్ ఐదో బంతికి ఓ శునకరాజం దర్జాగా స్టేడియం మధ్యలోకి వచ్చి ఫీల్డింగ్ చేస్తున్న రిషబ్ పంత్ పక్కన కూర్చుంది. ఎంతో చనువు ఉన్న మనిషిలా వచ్చి కుక్క అలా తన పక్కన కూర్చునే సరికి రిషబ్ పంత్ తొలుత గాభరా పడినా, దానిని కాలితో తన్నే ప్రయత్నం చేశాడు. అయితే పెంపుడు కుక్కలా అది అతని కాలును చిన్నగా నోటితో తోసిందేతప్ప కరిచే ప్రయత్నం చేయలేదు సరికదా, తోక ఊపుతూ అతని పక్కనే కూర్చుంది. దీనికి ముచ్చటపడిన మోర్నీ మోర్కెల్ దాంతో సరదాగా ఆడుకునే ప్రయత్నం చేస్తూ, సంజ్ఞలతో దానిని పిలుస్తూ వెనక్కి పరుగెత్తాడు. అతనితో పాటు సరదాగా పరుగెత్తిన కుక్క, చివరికి గ్రౌండ్స్ మన్ రావడంతో స్టేడియంలో కాసేపు అటూ ఇటూ పరుగెత్తింది. దీంతో ఆటగాళ్లు కుక్కవైపు ఆసక్తిగా చూస్తూ కాసేపు గడిపారు.