: గోళ్లు పీకేశారు, నోరు కుట్టేశారు, వీపు కోసి ఉప్పు చల్లారు...నరకం చూపించారు: ఉగ్రవాదుల పైశాచికత్వం
ఉగ్రదాడిలో మృతి చెందిన పాకిస్థాన్ లోని పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ కుమారుడు షాబాజ్ ను 2011 ఆగస్టు 26న ఉగ్రవాదులు ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. వారి చెర నుంచి గత మార్చిలో తప్పించుకున్న షాబాజ్ బీబీసీ, సీఎన్ఎన్ కు తీవ్రవాదుల చెరలో ప్రత్యక్ష నరకాన్ని చూసినట్టు వెల్లడించారు. అల్ ఖైదా అనుబంధం సంస్థ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్ ఉగ్రవాద సంస్థ తనను కిడ్నాప్ చేసిందని ఆయన చెప్పారు. ఉగ్రవాదులు అపహరించిన నాటి నుంచి ఏదో ఒకనాటికి కుటుంబ సభ్యులను కలుస్తాననే ఆశతో జీవించానని అన్నారు. తీవ్రవాదులు తన చేతి, కాలి వేళ్లకు ఉన్న గోళ్లను పీకేశారని ఆయన తెలిపారు. నిత్యం రబ్బరు కొరడాతో కొట్టేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. తన వీపు మీద బ్లేడ్లతో కోసి ఉప్పు చల్లేవారని తనపై జరిగిన ఉగ్రహింసను వెల్లడించారు. తన నోటిని సూది దారంతో కుట్టేసి, వారం రోజులపాటు ఆకలితో మాడ్చేవారని ఆయన చెప్పారు. పారిపోకుండా ఉండేందుకు తన కాలిపై తుపాకీతో కాల్చారని ఆయన వెల్లడించారు. తన శరీరాన్ని కత్తులతో కోయగా, ఏడు రోజుల పాటు రక్తస్రావం ఆగలేదని ఆయన తెలిపారు. తనకు ఏ ఒక్కరూ సాయం చేయలేదని ఆయన తెలిపారు. అయితే ఇంత కష్టంలో కూడా తన ఆశ చావలేదని, ఆ ఆశ, సహనమే తాను విడుదలయ్యేందుకు కారణమని ఆయన చెప్పారు. ఇప్పుడు తనను అంతా ధైర్యవంతుడని పేర్కొంటుంటే ఎంత ఆనందంగా ఉందో చెప్పలేనని ఆయన చెప్పారు. సాహసవంతమైన చర్యగా పేర్కొంటున్నప్పటికీ తాను దాటి వచ్చిన అనుభవాలు ఎవరూ ఊహించలేనివని ఆయన చెప్పారు.