: తొలిసారి అధికారిక పర్యటన నిమిత్తం ఇండియాకు రానున్న యాపిల్ సీఈఓ టిమ్ కుక్, హైదరాబాద్ కు కూడా!
యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ ఈ వారాంతంలో ఇండియాకు అధికారిక పర్యటన నిమిత్తం రానున్నారు. గతంలో ఆయన సొంత కంపెనీ వ్యవహారాలకు సంబంధించి మాత్రమే ఇండియాలో తిరిగి వెళ్లారు. ఇప్పుడు మాత్రం, ప్రధాని మోదీతో ఆయన కలసి చర్చలు జరపనుండటంతో, కుక్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఐఫోన్లను ఇండియాలో తయారు చేసే ఆలోచనల్లో ఉన్న కుక్, అందుకు సంబంధించిన ప్రణాళికలపై ప్రధానితో స్వయంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. యాపిల్ సంస్థకు అతిపెద్ద మాన్యుఫాక్చరింగ్ భాగస్వామిగా ఉన్న ఫాక్స్ కాన్, ఇప్పటికే అదానీ గ్రూప్ తో జాయింట్ వెంచర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా, కుక్ పర్యటనపై మరిన్ని వివరాలు అందించేందుకు ఇక్కడి కార్యాలయం నిరాకరించింది. ఇది ప్రభుత్వాధికారులతో చర్చలకు సంబంధించిన పర్యటన కాబట్టి, సమావేశాలు ఖరారైన తరువాత మాత్రమే వివరాలు ఇవ్వగలమని వెల్లడించింది. టిమ్ కుక్ శనివారం నాడు మోదీతో సమావేశమవుతారని సమాచారం. తన పర్యటనలో భాగంగా కుక్ బెంగళూరు, హైదరాబాద్ నగరాలను సందర్శిస్తారని, హైదరాబాద్ లో డెవలప్ మెంట్ సెంటరును ప్రారంభిస్తామని ఇప్పటికే వెల్లడించిన సంస్థ, అందుకు సంబంధించిన మరిన్ని వివరాలను ఈ పర్యటనలో తెలుపవచ్చని అంచనా. హైదరాబాద్ పర్యటనలో ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఐటీ మంత్రి కేటీఆర్ తదితరులను కలుస్తారని తెలుస్తోంది.