: తల నుంచి రక్తం కారుతున్నా... స్వయంగా 108కు ఫోన్ చేసిన పిన్నమనేని!
నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత హైదరాబాదు సమీపంలోని తుక్కుగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు సీటు బెల్టు పెట్టుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పిన్నమనేని ప్రయాణిస్తున్న కారు ఔటర్ పై బోల్తా కొట్టిన ఆ ఘటనలో ఆయన సతీమణి సాహిత్యవాణి, కారు డ్రైవర్ దాసు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పిన్నమనేనికి తల నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే సాహిత్యవాణి, దాసు అల్లంత దూరాన ఎగిరిపడగా, సీటు బెల్టు పెట్టుకున్న కారణంగా పిన్నమనేని కారు నుంచి బయటపడలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ఓ వైపు తల నుంచి రక్తం కారుతున్నా... రోడ్డుపై అల్లంత దూరాన భార్య, కారు డ్రైవర్ పడి ఉన్న వైనం పిన్నమనేనిని తీవ్రంగా కలచివేసింది. దీంతో ఓ వైపు తల నుంచి రక్తం కారుతుండగానే ఆయన తన సెల్ ఫోన్ తీసి 108కు స్వయంగా ఫోన్ చేశారట. ఈ మేరకు అపోలో ఆసుపత్రి వద్ద పిన్నమనేని సోదరుడు మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఈ విషయం చెప్పారు. 108కు ఫోన్ చేసిన తర్వాత ఏం జరిగిందన్న విషయం తన సోదరుడు చెప్పలేకపోతున్నారని ఆయన తెలిపారు.