: రాహుల్ గాంధీ లో స్మార్ట్ ఇన్వెస్టర్ కూడానా... నాలుగేళ్లలో 280 శాతం లాభం ఎలా?: ప్రశ్నించిన బీజేపీ


ఓ రూ. 1000 పెట్టుబడిగా పెడితే, నాలుగేళ్ల తరువాత ఎంతవుతుంది? బ్యాంకులో వేస్తే దాదాపుగా రూ. 1,320 అవుతుంది. నాలుగేళ్ల క్రితం బంగారం కొనివుంటే, రూ. 1,600 అయివుంటుంది. స్టాక్ మార్కెట్ ను నమ్ముకుంటే, రూ. 1,180 అయ్యుండేది. ఈ నాలుగేళ్లలో 280 శాతం లాభపడి రూ. 2,800 సంపాదించాలంటే... ఎంతో స్మార్ట్ ఇన్వెస్టర్ అయ్యుండాలి. ఇక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనలో ఓ స్మార్ట్ ఇన్వెస్టర్ ఉన్నాడని తొలిసారిగా నిరూపించుకున్నారు. ఇప్పుడదే ఆయనపై విమర్శలు గుప్పిస్తోంది. నిర్మాణ రంగంలో ఆయన పెట్టుబడి కేవలం నాలుగేళ్లలో 280 శాతం లాభాలను తెచ్చి పెట్టింది. ఢిల్లీలోని సాకేత్ ప్రాంతంలో ఎంజీఎఫ్ నిర్మించిన మెట్రో పాలిటన్ మాల్ లో రెండు షాపులను గతంలో కొనుగోలు చేసిన ఆయన, వాటిని వేల్ స్పున్ గ్రూప్ కు భారీ లాభానికి విక్రయించారు. ఈ క్రయ విక్రయ లావాదేవీలు 2005 నుంచి 2010 మధ్య జరిగాయని, వీటిల్లో అవకతవకలు ఉన్నాయని బీజేపీ ఎంపీ కిరీట్ సోమయ్య ఆరోపించారు. డిసెంబర్ 2005లో రూ. 1.47 కోట్లకు ఎమ్మార్ ఎంజీఎఫ్ గ్రూప్ నుంచి షాప్స్ కొన్న ఆయన, ఫిబ్రవరి 2010లో వాటిని 5.6 కోట్లకు విక్రయించినట్టు ఆయన తెలిపారు. ఆ సమయంలో, ముఖ్యంగా 2008 నుంచి ఆర్థిక మాంద్యం ఇబ్బందులు పెట్టడం మొదలైన వేళ, అంతలాభం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం విషయమై మీడియాతో మాట్లాడిన సోమయ్య, రాహుల్ లావాదేవీలను ప్రశ్నించారు. కాగా, ఈ విషయమై వివరణ కోరేందుకు రాహుల్ కార్యాలయాన్ని సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాగా, డీల్ లో అవకతవకలు లేవని, తాము షాపులను విక్రయిస్తూ 67 లావాదేవీలు జరుపగా, వాటిల్లో అత్యధిక మొత్తం చెల్లించింది రాహుల్ గాంధీయేనని ఎమ్మార్ వివరణ ఇచ్చింది.

  • Loading...

More Telugu News