: రజనీకాంత్ కిడ్నాప్ కు ప్లాన్ వేసిన వీరప్పన్: రాంగోపాల్ వర్మ
మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన వీరప్పన్, తన హవా నడుస్తున్న సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ను కిడ్నాప్ చేయాలని భావించాడని, అందుకు భారీ ఎత్తున ప్రణాళికను కూడా రూపొందించుకున్నాడని దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపాడు. వీరప్పన్ జీవిత చరిత్ర ఆధారంగా వర్మ నిర్మించిన చిత్రం హిందీలో విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశాడు. వీరప్పన్ కు, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వానికి మధ్య మధ్యవర్తిత్వం నడిపిన వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, ఆయన రజనీకాంత్ కిడ్నాప్ కు ప్లాన్ వేసినట్టు తెలిసిందని పేర్కొన్నాడు. అది అంత సులభం కాదని తెలుసుకున్న తరువాతనే, ఆయన అదే ప్లాన్ కన్నడ స్టార్ రాజ్ కుమార్ పై అమలు చేశాడని తెలిపాడు. "నేను సేకరించిన వాస్తవాల ప్రకారం, వీరప్పన్ కథ నమ్మశక్యం కానిది. అంతకన్నా నమ్మశక్యం కానిది ఏమిటంటే, ఆయన్ను చంపడానికి ప్రభుత్వాలు వేసిన ప్రణాళికల వెనుక వున్న డ్రామా" అన్నాడు వర్మ. కాగా, ఈ చిత్రం హిందీలో 27న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.