: సీటు బెల్టే పిన్నమనేని ప్రాణాలను కాపాడింది!... బెల్టు పెట్టుకోని కారణంగానే భార్య దుర్మరణం!
టీడీపీ సీనియర్ నేత, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కారు ప్రమాదానికి సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఓ శుభకార్యం నిమిత్తం నిన్న ఉదయం హైదరాబాదు నుంచి ‘పజేరో స్పోర్ట్’ కారులో భార్య సాహిత్యవాణితో కలిసి విజయవాడ వెళ్లిన పిన్నమనేని... సదరు కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత నిన్న రాత్రే హైదరాబాదుకు తిరుగు పయనమయ్యారు. ఈ సందర్భంగా కారును మితిమీరిన వేగంతో నడుపుతున్న డ్రైవర్ దాసును పిన్నమనేని పలుమార్లు వారించారు. ఈ క్రమంలో కారు స్పీడును తగ్గిస్తూ, పెంచుతూ దాసు కారును నడిపినట్లు తెలుస్తోంది. మరికొద్ది నిమిషాల్లో హైదరాబాదులోని ఇంటికి చేరుకుంటారనగా... వేగం పెరిగిన పిన్నమనేని కారు తుక్కుగూడ వద్ద బోల్తా కొట్టింది. ఇక కారెక్కగానే పిన్నమనేని సీటు బెల్టు పెట్టుకున్నారు. అయితే ఈ విషయాన్ని సాహిత్యవాణితో పాటు కారు డ్రైవర్ దాసు అంత పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో సీటు బెల్టు పెట్టుకున్న పిన్నమనేని ప్రాణాలు దక్కించుకున్నారు. సీటు బెల్టు లేని కారణంగా సాహిత్యవాణితో పాటు దాసు కూడా కారు నుంచి అల్లంత దూరం ఎగిరిపడ్డారు. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. వెరసి సీటు బెల్టు పెట్టుకుని కాస్తంత జాగ్రత్తగా ఉన్న పిన్నమనేని ఈ ప్రమాదంలో గాయాలతో బయటపడ్డారు.