: అనందీ వెళ్లిపోతున్నారా?... అంతలేదు: గుజరాత్ ముఖ్యమంత్రి మార్పుపై బీజేపీ
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందీ బెన్ పటేల్ రాజీనామా చేయనున్నారని వచ్చిన వార్తలను బీజేపీ ఖండించింది. పార్టీలో నెంబర్ 2గా ఉన్న నితిన్ భాయ్ పటేల్ ముఖ్యమంత్రిగా పదవిని స్వీకరిస్తారని వచ్చిన వార్తలనూ తోసిపుచ్చింది. ఈ వార్తలన్నీ రూమర్స్ అని బీజేపీ ప్రతినిధి భరత్ పాండ్యా వెల్లడించారు. ఆనందీబెన్ ను తొలగిస్తారని వచ్చిన వార్తలు ఊహాగానాలేనని ఆయన స్పష్టం చేశారు. కాగా, నిన్న ఆనందీబెన్ ఢిల్లీకి వచ్చి పార్టీ చీఫ్ అమిత్ షాతో రెండు గంటల పాటు భేటీ కావడం, ఆపై ప్రధాని మోదీతో సమావేశమవడంతో, ఆమెను గుజరాత్ లేదా పంజాబ్ రాష్ట్రాలకు గవర్నరుగా నియమించవచ్చని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో నితిన్ భాయ్ సైతం ఢిల్లీకి రావడంతో ఆయన్ను సీఎంగా నియమిస్తారని మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. గుజరాత్ లో ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందని, ఇప్పుడు సీఎంను మార్చాల్సిన అవసరం లేదని పాండ్యా తెలిపారు. ఆనందీ, నితిన్ పటేల్ లు కరవు, నీట్ తదితర అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వచ్చారని, అంతకుమించి నాయకత్వ మార్పిడి అంశంపై చర్చలు లేవని స్పష్టం చేశారు.