: హస్తినలో పుంజుకున్న బీజేపీ, కాంగ్రెస్!... కార్పొరేషన్ బైపోల్స్ లో చెరో మూడు సీట్లు కైవసం
దేశ రాజధాని ఢిల్లీలో ప్రాభవం కోల్పోయిన కాంగ్రెస్ తో పాటు కేంద్రంలో అధికార బీజేపీ కాస్తంత పుంజుకున్నాయి. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ లో 13 డివిజన్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు చెరో మూడు సీట్లలో విజయం సాధించాయి. ఇక గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు షాకిచ్చిన కేజ్రీవాల్ నేతృత్వంలోని 'ఆప్'... అంతగా రాణించలేకపోయింది. ఇటీవల జరిగిన బైపోల్స్ కు సంబంధించిన కౌంటింగ్ నేటి ఉదయం ప్రారంభమైంది. కడపటి వార్తలు అందేసరికి 10 స్థానాల ఫలితాలు వెలువడగా... కాంగ్రెస్, బీజేపీలు చెరో మూడు స్థానాల్లో విజయం సాధించాయి. ఇక ఆప్ నాలుగు చోట్ల విజయం సాధించింది. మరో మూడు స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతోంది.