: దిగొచ్చిన కంచె ఐలయ్య!... బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పిన ప్రొఫెసర్!
తిని కూర్చునే సోమరులుగా బ్రాహ్మణులను అభివర్ణించిన జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఎట్టకేలకు దిగొచ్చారు. బ్రాహ్మణులపై తాను చేసిన వ్యాఖ్యలకు ఐలయ్య క్షమాపణ చెప్పారు. విజయవాడ కేంద్రంగా రెండు రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా బ్రాహ్మణులపైనే కాక హిందూ దేవుళ్లపైనా ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై మొన్న ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ, బ్రాహ్మణ సంక్షేమ సంఘం చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమరులుగా ఉన్న బ్రాహ్మణుల అడ్రెస్ లు చెబితే దండిస్తామంటూ ఐలయ్యకు చురకలు అంటించారు. తాజాగా నిన్న కరీంనగర్ జిల్లా జగిత్యాలలో ఐలయ్యను కలిసిన బ్రాహ్మణులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పారు. బ్రాహ్మణిజానికి మాత్రమే తాను వ్యతిరేకినని, బ్రాహ్మణులకు కాదని ఆయన పేర్కొన్నారు. తన వ్యాఖ్యలు నొప్పించి ఉంటే మన్నించాలని ఆయన బ్రాహ్మణులను కోరారు. బ్రాహ్మణుల పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని కూడా ఆయన ప్రకటించారు. తాను చేయని వ్యాఖ్యలను ఓ తెలుగు దినపత్రిక రాసిందని ఆయన ఆరోపించారు.