: పక్కా లెక్కతో చంద్రబాబు సిద్ధం!... ‘హోదా’పై పట్టు వీడరాదని నిర్ణయం!
రాష్ట్రంలో కరవు పరిస్థితిపై చర్చిద్దాం రమ్మంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి పిలుపు అందుకున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. కరవుపై ప్రధానితో భేటీ ముగియగానే... అక్కడికక్కడే ఏపీకి ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రధానితో ప్రత్యేక భేటీని నిర్వహిస్తారు. ఈ భేటీకి సంబంధించి రాష్ట్రం తరఫున గట్టి వాదననే వినిపించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నిన్న పార్టీ సీనియర్లు, మంత్రులు, పలు కీలక శాఖల ఉన్నతాధికారులతో ఆయన విజయవాడలో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కేంద్రం చేసిన సాయం, చేయాల్సిన సాయం తదితరాలకు సంబంధించి ఆయన పక్కా లెక్కపత్రాలు సిద్ధం చేసుకున్నారు. కేంద్ర సాయానికి సంబంధించి అణా పైసలు సహా లెక్కలు వేసి అధికారులు ఇచ్చిన నివేదికలను చేతబట్టుకుని మోదీ వద్దకు వెళ్లనున్న చంద్రబాబు... గతంలో మాదిరిగా కాకుండా ఈ దఫా కాస్తంత గట్టిగానే తన స్వరాన్ని వినిపించాలని నిర్ణయించుకున్నారు. ‘ప్రత్యేక హోదా ఏపీ హక్కు’ అన్న సింగిల్ నినాదంతో చంద్రబాబు వ్యూహం రచించుకున్నారు. ఇందులో భాగంగా ప్రధాని వద్ద ప్రస్తావించాల్సిన అన్ని అంశాలను ఆయన సిద్ధం చేసుకున్నారు. మొత్తం 12 అంశాలను చంద్రబాబు ప్రధాని వద్ద ప్రస్తావించనున్నారని విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధానితో చంద్రబాబు భేటీలో ఏ ఫలితాలు వస్తాయన్న విషయంపై ఆసక్తి నెలకొంది.