: గూగుల్ డ్రైవర్ లెస్ కార్లకు ప్రత్యేక డ్రైవర్లు
గూగుల్ సంస్థకు చెందిన డ్రైవర్ లెస్ కార్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రహదారులపై ప్రయోగాత్మకంగా ఈ వాహనాలను ‘గూగుల్’ నడిపిస్తోంది. అయితే, ఈ వాహనాలు రోడ్లపై ఏ విధంగా నడుస్తున్నాయి? ఇతర వాహనాలు, మనుషులు అడ్డం వచ్చినప్పుడు ఎలా తప్పించుకుంటున్నాయనే పలు విషయాలను గమనించేందుకు, అందుకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు తయారు చేసేందుకు, అవసరమైతే ఆ కార్లను మాన్యువల్ గా కూడా నడిపేందుకు ఒక ప్రత్యేక డ్రైవర్ కావాలని సదరు సంస్థ భావించింది. ఈ నేపథ్యంలోనే ‘వెహికల్ సేఫ్టీ స్పెషలిస్టు’ పేరిట ప్రత్యేక డ్రైవర్ల నియామకం చేపట్టింది. ఈ ప్రత్యేక డ్రైవర్లు 12 నుంచి 24 నెలలు పనిచేసేలా సంస్థతో ఒప్పందం ఉంటుంది. వారంలో ఐదు రోజులు పని దినాలు ఉంటాయి. రోజుకు 6 నుంచి 8 గంటల చొప్పున పని చేయాలి. విద్యార్హతల విషయాని కొస్తే కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి, నిమిషానికి కనీసం 40 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం, చక్కగా డ్రైవింగ్ చేేయగలిగి ఉండటంతో పాటు ఎలాంటి నేరచరిత్ర ఉండకూడదన్నవి సంస్థ నియమనిబంధనలుగా ఉన్నాయి.