: తమిళనాట పోలింగ్ కు వర్షం అడ్డంకి... మందకొడిగా పోలింగ్!
ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులో పోలింగ్ కు వరుణుడు అడ్డు తగిలాడు. చెన్నై సహా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో ఓటర్లు పోలింగ్ బూత్ లకు మందకొడిగా సాగారు. దీంతో మధ్యాహ్నం 2:30 గంటల వరకు కూడా చాలా చోట్ల 40 నుంచి 45 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. వర్షం కొనసాగితే, పోలింగ్ శాతం గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు వ్యాఖ్యానించారు. కాగా, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు తమతమ పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు కేరళలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి 57 శాతం పోలింగ్ నమోదు కాగా, పుదుచ్చేరిలో 59 శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది.