: ఐశ్వర్యా రాయ్ అందాన్ని నాశనం చేసిన పర్పుల్ కలర్ లిప్ స్టిక్... నెటిజన్ల కోపాగ్ని!
అందాల నటి ఐశ్వర్యారాయ్ చేసిన ఓ చిన్న మేకప్ తప్పిదం, ఆమెపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు కారణమైంది. ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రస్తుతం కేన్స్ చిత్రోత్సవంలో భాగంగా, తన తాజా చిత్రం సరబ్ జిత్ ను ప్రమోట్ చేసుకునే పనిలో ఉన్న ఆమె, తొలి రోజు గోల్డ్ కలర్ డ్రస్ తో చూపరులను తన వైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే. మలి రోజున ఆమె లేత గులాబీ రంగులో ఉన్న పొడవైన గౌన్ ధరించి వచ్చింది. అంత వరకూ బాగానే ఉంది కానీ, పెదవులకు పర్పుల్ కలర్ వేసుకు వచ్చింది. దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురైన అభిమానులు పలు రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. పెదవులకు వేసుకునేందుకు ఈ రంగే దొరికిందా? అని ఒకరు, మా 50 కేజీల తాజ్ మహలేనా ఈ అమ్మాయి? అని ఇంకొకరు, నేరేడు పండ్లు ఎక్కువగా తిని నోరు కడుక్కోకుండా వచ్చిందని మరొకరు, ఐష్ కు మేకప్ వేసిన వాళ్లపై కేసులు పెట్టాలని ఇంకొకరు... ఇలా సాగుతున్నాయి ఆమెపై కామెంట్స్!