: జగన్ దీక్ష ఎందుకు చేస్తున్నారో వైసీపీ నేతలకే తెలియదట: మంత్రి గంటా వ్యాఖ్య
తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దెబ్బతీసేలా అక్రమ సాగునీటి ప్రాజెక్టులు నిర్వహిస్తోందని, సీఎం చంద్రబాబు వాటిపై స్పందించడం లేదని ఆరోపిస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరికాసేపట్లో కర్నూలులో మూడు రోజుల దీక్షను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌పై ఏపీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మూడు రోజుల దీక్షను ఎందుకు చేస్తున్నారో వైసీపీ నేతలకే తెలియదని, ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే చెబుతున్నారని గంటా వ్యాఖ్యానించారు. రాజకీయాలు, ప్రాజెక్టులపై అనుభవం లేనితనంతోనే జగన్ దీక్షకు దిగుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టిని తన వైపుకు తిప్పుకునేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. కాగా, కర్నూలు శివారులోని నంద్యాల చెక్ పోస్ట్ వద్ద కేంద్రీయ విద్యాలయం సమీపంలో దీక్షకు దిగడానికి జగన్ డోన్ రోడ్డు నుంచి ర్యాలీగా బయలుదేరారు. మరికాసేపట్లో జగన్ దీక్షా స్థలికి చేరుకోనున్నారు.