: ఆందోళన వద్దు.. తెలుగు విద్యార్థులకు ‘నీట్’తో ఎన్నో లాభాలు: కడియం శ్రీహరి
మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న నీట్ తో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఎన్నో లాభాలున్నాయని తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో నిర్వహించిన నీట్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. లక్షల రూపాయలతో సీట్లు పొందలేని విద్యార్థులకు నీట్‌తో దేశ వ్యాప్తంగా తక్కువ ఫీజుతోనే చదువుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. జేఈఈ వంటి పరీక్షల్లో ఐదారేళ్ల నుంచి తెలుగు విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారని, నీట్ లోనూ రాణిస్తారని ఆయన అన్నారు. నీట్ గురించి భయాలు వద్దని సూచించారు. విద్యార్థులకు ఉన్న సందేహాలను నిపుణుల ద్వారా తొలగించుకోవాలని ఆయన సూచించారు. కొన్ని విద్యా సంస్థలు ఇష్టా రాజ్యంగా అడ్మిషన్ ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న నీట్ వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎంతో లాభపడతారని కడియం శ్రీహరి తెలిపారు. దేశ వ్యాప్తంగా పేరుపొందిన విద్యాసంస్థల్లో మెడికల్ సీట్లకు తెలుగు విద్యార్థులు పోటీ పడొచ్చని ఆయన అన్నారు.