: 52 శాతం మార్కులతోనే సివిల్స్ టాపర్ గా నిలిచిన టీనా దాబి
ఇండియాలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలుగా పేరున్న సివిల్ సర్వీసెస్ విభాగంలో పరీక్ష ఎంతో కఠినంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ దశల్లో జరిగే పరీక్షల్లో ఉత్తీర్ణులైతే, వారిని ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ తదితర విభాగాల్లో నియమిస్తారు. ఇక ఈ సంవత్సరం సివిల్స్ మెయిన్ లో దేశవ్యాప్తంగానే తొలి స్థానంలో నిలిచిన ఢిల్లీ యువతి టీనా దాబి పొందిన మార్కులెన్నో తెలుసా? మెయిన్స్ పరీక్షలో 1,750, ఇంటర్వ్యూలో 275 మార్కుల వరకూ అభ్యర్థులు స్కోర్ చేసేలా మొత్తం 2,025 మార్కులకు పరీక్ష జరిగితే, టీనాకు 52.49 శాతంగా, 1,063 మార్కులు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచిన అమీల్ ఉల్ షఫీ ఖాన్ కు 1,018 మార్కులు (50.27 శాతం), మూడో ర్యాంకర్ జస్మీత్ సింగ్ సంధు 1,014 మార్కులు (50.07 శాతం) పొందారని యూపీఎస్సీ వెల్లడించింది. ఖాన్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ ఆఫీసర్ గా, సంధు ఇండియన్ రెవెన్యూ సర్వీస్ విభాగాల్లో ఇప్పటికే పని చేస్తూ, మరింత ఉన్నత ఉద్యోగాన్ని కోరుతూ పరీక్షలు రాశారు.