: పండ్లలోని గింజలు చేసే మేలు ఏంటో తెలుసా?
సాధారణంగా ఏదైనా పండు తినేసిన తరువాత అందులోని గింజలను పారేస్తాం. అదే కాస్త ముందు చూపు ఉన్నవారైతే వాటిని పెరట్లో విత్తనాలుగా వేస్తారు. మొక్కలు వస్తే జాగ్రత్తగా పాదు చేసి వాటి ఫలాలు తింటారు. ఇప్పటి యాంత్రిక జీవనంలో అంత ఓపిక ఎవరికీ ఉండడం లేదు. కానీ మనం తీసిపడేసే విత్తనాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. నిజానికి పండులో గుజ్జు కన్నా విత్తనాలే ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తాయని వారు సూచిస్తున్నారు. పండ్లలోని విత్తనాలు తినడం వల్ల వచ్చే ప్రయోజనాలపై పలువురు పరిశోధకులు అధ్యయనం చేశారు. ఈ పరిశోధనల్లో ఆసక్తికర విషయాలను గుర్తించారు. అయితే అన్ని రకాల పండ్ల విత్తనాలు ఆరోగ్యాన్ని ఇవ్వవని గుర్తించాలని వారు సూచిస్తున్నారు. వేసవిలో సాధారణంగా తినే పుచ్చకాయ విత్తనాలు జుత్తు, చర్మం, గోళ్ళ ఆరోగ్యాన్ని కాపాడతాయని వారు చెబుతున్నారు. అలాగని విత్తనాలు తినకూడదని, పండుతో పాటు తీసుకోవడం మంచిదని, అలాగే బొప్పాయి పండులోని విత్తనాలను కూడా తినవచ్చని వారు సూచించారు. ఈ విత్తనాల్లో ఉండే పొట్రియోలిక్ ఎంజైమ్ ల వల్ల కడుపులో ఉండే నులిపురుగులు నశిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. నులిపురుగుల సమస్య వేధించే పిల్లలకు ఈ పండ్లను విత్తనాలతో పాటు తినిపిస్తే, ఆ సమస్యనుంచి పరిష్కారం లభిస్తుందని వారు తెలిపారు. అయితే, ఎలా పడితే అలా చిన్నపిల్లలతో ఈ విత్తనాలు తినిపించకుండా, వైద్యుల సలహా తీసుకుని వీటిని తినిపించడం అవసరమని వారు సూచించారు. ఎంతో కాలంగా గుమ్మడి విత్తనాలు తీసుకోవడం పలువురికి అలవాటు ఉంటుందని, అయితే దాని ప్రయోజనాలు పూర్తిగా తెలియవని వారు పేర్కొంటున్నారు. గుమ్మడి విత్తనాలు తినడం వల్ల డిప్రెషన్, శరీరంలో వాపులు తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు. నిమ్మకాయ విత్తనాలు, కివి సీడ్స్ తింటే మంచి ఫలితం ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు. అయితే వాటి ప్రయోజనాలు తెలుసుకుని తినాలని, తెలుసుకోకుండా తినే ప్రయత్నం చేయవద్దని వారు సూచిస్తున్నారు.