: ‘హోదా’ కోసం జనసేన జలదీక్ష!... కాకినాడలో సముద్రంలో దిగి కార్యకర్తల వినూత్న నిరసన


ఏపీకి ప్రత్యేక హోదా కోసం టాలీవుడ్ ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న డిమాండ్లతో రాసిన ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకున్న ఆ పార్టీ కార్యకర్తలు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జల దీక్ష పేరిట వినూత్న నిరసనకు దిగారు. ప్లకార్లు చేతబట్టిన ఆ పార్టీ కార్యకర్తలు సముద్రంలోకి దిగి మోకాళ్ల లోతు నీటిలో నిలబడి ‘హోదా’ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్త మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్రంలోని అధికార బీజేపీపై ఉందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన గురుతర బాధ్యతను బీజేపీ విస్మరిస్తోందని ఆయన విమర్శించారు. ఏపీకి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే గడచిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి అనుకూలంగా తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేశారని ఆయన చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్టీల జెండాలు పక్కనబెట్టి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ వాసులు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని అయినా, ఎంపీలు పోరాడాలని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News