: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ!... 19న టీడీపీలోకి కొత్తపల్లి సుబ్బారాయుడు!


ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ విపక్ష వైసీపీకి ఊపిరి ఆడనివ్వడం లేదు. ఇప్పటికే 17 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి చేయిచ్చేసి సైకిల్ ఎక్కేశారు. వీరిలో ఆ పార్టీకి చెందిన రెండు జిల్లాల అధ్యక్షులు కూడా ఉన్నారు. తాజాగా ఈ నెల 19న వైసీపీకి చెందిన మరో జిల్లా అధ్యక్షుడి పోస్టు కూడా ఖాళీ కానుంది. గడచిన ఎన్నికల్లో టీడీపీకి క్లీన్ స్వీప్ లభించిన పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఝలక్కివ్వనున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు మూడు రోజుల క్రితమే ప్రకటించిన కొత్తపల్లి... ఈ నెల 19న విజయవాడలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా... చంద్రబాబు కేబినెట్ లో విద్యుత్ శాఖ మంత్రిగా కొత్తపల్లి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. నాడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా పేరుపడ్డ మంత్రుల్లో కొత్తపల్లి ఒకరు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లిన కొత్తపల్లి... ఆ తర్వాత వైసీపీలో చేరక తప్పలేదు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి గడచిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన కొత్తపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల చంద్రబాబు తనను పలకరించడం, పార్టీలోకి ఆహ్వానించడంతో కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నారు.

  • Loading...

More Telugu News