: కార్యరంగంలోకి చంద్రబాబు!... ఢిల్లీ పర్యటన, నీట్ లపై బెజవాడలో సమీక్ష
వారం పాటు కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు కొద్దిసేపటి క్రితం తిరిగి తన విధుల్లో చేరిపోయారు. నిన్న రాత్రి స్విట్జర్లాండ్ నుంచి బయలుదేరిన చంద్రబాబు నేటి తెల్లవారుజామునే హైదరాబాదులోని శంషాబాదు ఎయిర్ పోర్టులో దిగి, అక్కడి నుంచి బయలుదేరి విమానంలో గన్నవరం చేరుకొని, విజయవాడ వెళ్లారు. వెనువెంటనే ఆయన కార్యరంగంలోకి దిగిపోయారు. అందుబాటులో ఉన్న మంత్రులను, అధికారులను పిలిపించుకున్న చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ నెల 17న ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ఆయన ప్రధానితో కీలక చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని వద్ద లేవనెత్తాల్సిన అంశాలపై ఆయన మంత్రులతో సమీక్షిస్తున్నారు. మరోవైపు మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కేంద్రం నిర్వహించిన నీట్ పరీక్షపైనా చంద్రబాబు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి సీనియర్ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, కామినేని శ్రీనివాస్ లతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.