: 30 కోట్లు లంచం డిమాండ్ చేసి, పట్టుబడిన మహారాష్ట్ర మంత్రి పీఏ... తనకు సంబంధం లేదన్న మంత్రి
30 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేసి, మంత్రిగారి పీఏ పట్టుబడిన ఘటన మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఏక్ నాథ్ ఖడ్సే పీఏ గజనన్ పాటిల్ ను 30 కోట్ల రూపాయల డిమాండ్ ఘటనలో ఆ రాష్ట్ర ఏసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ ఆర్థికవేత్త రమేశ్ జాదవ్ 2004 లో తన ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ కోసం థానే జిల్లాలోని కళ్యాణ్ తాలుకాలోని నిల్జే గ్రామంలో 37 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ప్రమాదవశాత్తు ఈ భూములకు సంబంధించిన పత్రాలు కాలిబూడిదయ్యాయి. దీంతో ఈ భూములు తనవే అని నిరూపించుకునేందుకు ఎన్ఓసీ కావాలని పేర్కొంటూ ఆయన రెవెన్యూ మంత్రి కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఎన్ఓసీ ఇచ్చేందుకు అభ్యంతరం లేదని, అయితే అందుకు 30 కోట్ల రూపాయలు చెల్లించాలని ఖడ్సే పీఏగా చెప్పుకొంటున్న గజనన్ పాటిల్ డిమాండ్ చేశారు. మొదట్లో కోటి రూపాయల నగదుతో పాటు ఫ్లాట్ ఇవ్వాలని కోరిన పాటిల్ తరువాత 30 కోట్లు డిమాండ్ చేయడం ప్రారంభించాడని ఆయన పేర్కొన్నారు. దీంతో జాదవ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ను ఆశ్రయించడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు పాటిల్ ను అరెస్ట్ చేశారు. ఈ విషయం బట్టబయలు కావడంతో మంత్రి ఖడ్సే మాట్లాడుతూ, ఈ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. గజనన్ పాటిల్ తన నియోజకవర్గంలో చికిత్సల కోసం వచ్చే వారిని ముంబైకి తీసుకువచ్చే కార్యకర్తగా మాత్రమే తనకు తెలుసునని అన్నారు. ప్రభుత్వ లేదా ప్రైవేటు పరంగా పాటిల్ ను తన కార్యాలయంలో నియమించుకోలేదని ఆయన చెప్పారు.