: ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామన్న వ్యక్తిని, పదేళ్లు కావాలని అడిగిన వ్యక్తిని చెంపదెబ్బలు కొట్టగలరా?: రాష్ట్ర బీజేపీ నేతలకు సినీ నటుడు శివాజీ సవాల్
విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పిన వ్యక్తిని... ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలి, మేము అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని చెప్పిన బీజేపీ సీనియర్ నేతని బీజేపీ నేతలు చెంపలు వాయించి...తరువాత వారిని ఏపీకి తీసుకువచ్చి.. ఏపీకి ప్రత్యేకహోదా అవసరం లేదని...వారితో చెప్పించగలరా? అంటూ సినీ నటుడు, సామాజిక కార్యకర్త శివాజీ బీజేపీ నేతలకు సవాల్ విసిరాడు. బీజేపీ, టీడీపీ నేతలు పూటకో వ్యాఖ్య చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని, మూడేళ్ల కాలాన్ని ఇలాగే కొనసాగించి, నాలుగో ఏడు మళ్లీ దీనిని ఎన్నికల్లో విజయాస్త్రంగా మార్చుకోవాలని భావిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీల కుట్రలు చూస్తూ ఊరుకోమని, నిత్యం ప్రజల్లో ఉంటూ చైతన్యం కల్పిస్తామని ఆయన తెలిపారు. పార్టీలు నోటికొచ్చిన హామీలు ఇచ్చేసి, తరువాత మాటలు మారిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కంటే బీజేపీ ఎక్కువ చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ నమ్మించి గొంతు కోసిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు.