: డివిలియర్స్, కోహ్లీ సెంచరీలతో వీరవిహారం...సీజన్ లో భారీ స్కోరు ఇదే!


డివిలియర్స్, కోహ్లీ వీరవిహారం చేశారు. ఇద్దరూ చెలరేగి ఆడుతుంటే గుజరాత్ లయన్స్ బౌలర్లు, ఫీల్డర్లు చేష్టలుడిగారు. బంతి బౌండరీ దాటుతుంటే ఆటగాళ్లు కూడా ప్రేక్షకుల్లా మారిన ఘట్టం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చోటుచేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆదిలోనే షాక్ తగలింది. విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ (6)ను కులకర్ణి బౌల్డ్ చేశాడు. అయితే గేల్ ను అవుట్ చేసిన ఆనందరం గుజరాత్ కు ఎంతో సేపు నిలవలేదు. కోహ్లీకి డివిలియర్స్ జత కలిశాడు. ఆరంభంలో ఇద్దరూ నెమ్మదిగా ఇన్నింగ్స్ ను కొనసాగించారు. లయను అందుకున్న తరువాత ఇద్దరూ చెలరేగిపోయారు. నువ్వు ఫోర్ కొట్టు, నేను సిక్స్ కొడతా అన్నట్టు చెలరేగి ఆడారు. బంతులు బౌండరీ దాటుతుంటే ఆటగాళ్ల నివ్వెరపోతుండగా, అభిమానులు కేరింతలు కొట్టారు. బౌలర్ బంతిని వేసే సమయం కంటే బౌండరీ వద్ద పడిన బంతిని బౌలర్ కు అందించడానికే ఎక్కువ సమయం పట్టిందంటే వారిద్దరి ఇన్నింగ్స్ ఎలా కొనసాగిందో ఊహించవచ్చు. దీంతో ఇద్దరి వీరవిహారానికి డివిలియర్స్ 43 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సులతో సెంచరీ చేశాడు. ఆ తరువాత కోహ్లీ 53 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. చివరి ఓవర్ ఐదో బంతికి కోహ్లీ కొట్టిన షాట్ ను బ్రావో ఒడిసి పట్టడంతో 109 వ్యక్తిగత పరుగుల వద్ద అతని ఇన్నింగ్స్ ముగిసింది. చివరి బంతిని ఆడిన వాట్సన్ ఊహించని రీతిలో అవుటయ్యాడు. డివిలియర్స్ 129 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 248 పరుగులు చేసింది. ఈ సీజన్ లో ఇదే అత్యుత్తమ లక్ష్యం కావడం విశేషం. గుజరాత్ బౌలర్లలో గేల్ ను కులకర్ణి పెవిలియన్ కు పంపగా, కోహ్లీ, వాట్సన్ ను ప్రవీణ్ కుమార్ అవుట్ చేశాడు. 249 పరుగుల విజయ లక్ష్యంతో గుజరాత్ లయన్స్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించనుంది.

  • Loading...

More Telugu News