: రైల్లో ఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులు, ఒకరి మృతి ... ఇన్సాస్ రైఫిళ్లను ఎత్తుకెళ్లిన దుండగులు... బీహార్లో 'జంగిల్ రాజ్'!
బీహార్ లో చట్టం సక్రమంగా అమలు కావడం లేదని చెప్పడానికి, 'జంగిల్ రాజ్' కొనసాగుతోందని చెప్పడానికి మరో ఉదాహరణ ఇది. ఓ రైలుపై ఆయుధాలతో దాడి చేసిన ఆరుగురు గుర్తు తెలియని దుండగులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) జవానుపై దాడి చేసి కాల్చి చంపి, ఇన్సాస్ తుపాకులను తీసుకెళ్లారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన మొఘల్ సరాయ్ నుంచి బుక్సర్ ప్రయాణించే పాసింజర్ రైలు (63420)లో జరిగింది. మరణించిన జవాన్ ను అభిషేక్ సింగ్ గా గుర్తించారు. ఘటనా స్థలిని ఈ ఉదయం సందర్శించిన రైల్వే ఎస్పీ జితేంద్ర మిశ్రా, నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. దాడి చేసిన వారు ప్రొఫెషనల్ నేరగాళ్లని, ఆయుధాల కోసమే దాడి చేశారని వివరించారు.