: గ్రామ పంచాయితీలు విధించే 'బహిష్కరణలు' ఇక చెల్లవ్... జీవో జారీ చేసిన మహారాష్ట్ర!


దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహారాష్ట్ర సర్కారు తీసుకున్న ఓ నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా అన్ని రాష్ట్రాలూ అనుసరించాలని ప్రజాస్వామిక వాదులు కోరుకుంటున్నారు. గ్రామాల్లోని పంచాయితీలు విధించే 'సంఘ బహిష్కరణలు' చెల్లవని జీవోను తెచ్చిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. సమాజంలోని దిగువ తరగతి ప్రజలు గ్రామ పంచాయితీల నిర్ణయాల కారణంగా ఎంతో నష్టపోతున్నారని, సంప్రదాయాలు, కులం, వర్గాల పేర్లను చెబుతూ తీసుకునే ఈ నిర్ణయాలు సభ్య సమాజానికి మేలు చేయవని వ్యాఖ్యానించిన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, వీటిని అడ్డుకు తీరుతామని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం తీసుకురావాల్సిన సంస్కరణల గురించి ఆలోచించిన మీదటే పంచాయితీల బహిష్కరణ నిర్ణయాలను నిషేధిస్తున్నట్టు తెలిపారు. ఈ తరహా నిర్ణయాలు తీసుకున్నారని తెలిస్తే, ఏడేళ్ల జైలు శిక్ష లేదా రూ. ఐదు లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. కాగా, యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో గ్రామ పంచాయితీలు దళిత మహిళల పట్ల కఠోర నిర్ణయాలు, సమాజం తల దించుకునే శిక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మహారాష్ట్ర తీసుకున్న ఈ ఆదర్శ నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తాయో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News