: పంజాబ్ బౌలర్లు ఆకట్టుకున్నారు... మరి, ముంబై బౌలర్లు ఏం చేస్తారో!
ఐపీఎల్-9 సీజన్ లో పంజాబ్ బౌలర్లు ఆకట్టుకున్నారు. విశాఖ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ ఆడిన ఓపెనర్ ఉన్ముక్త్ చంద్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన తెలుగు కుర్రాడు అంబటి రాయుడు కూడా డకౌటయ్యాడు. దీంతో కేవలం 8 పరుగులకే ముంబై రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో నితీశ్ రానా (25)తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ (15) ఇన్నింగ్స్ కు మరమ్మతులు చేసే ప్రయత్నం చేశాడు. అయితే అది కూడా ఎంతో సేపు కాదు...ఒత్తిడిలో ఉన్న రోహిత్ ను అక్షర్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆదుకుంటాడని భావివించిన జోస్ బట్లర్ (9) విఫలమయ్యాడు. కీరన్ పొలార్డ్ (27), కృనాల్ పాండ్య (19) జోడి పంజాబ్ బౌలర్లపై బౌండరీలతో కాసేపు ఆందోళన రేపింది. అయితే వరుస బంతుల్లో వీరిద్దరినీ స్టొయిన్స్ అవుట్ చేయడంతో, క్రీజులోకి వచ్చిన హర్భజన్ సింగ్ (14) మెరుపులు మెరిపించాడు. దీంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో స్టొయిన్స్ 4 వికెట్లతో సత్తాచాటగా, మోహిత్ శర్మ, సందీప్ శర్మ చెరో రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసి అతనికి సహకరించారు. కాసేపట్లో 125 పరుగుల విజయ లక్ష్యంతో పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేస్తుంది.