: 'శుభమ్'గా అందరికీ తెలిసిన యువకుడు... సివిల్స్ విజేతగా మారిన తరువాత 'అన్సర్ షేక్' అయ్యాడు!


సివిల్స్ పరీక్షల్లో తాను విజయం సాధించానని తెలియగానే ఆ యువకుడు చేసిన మొదటి పని తన తల్లికి ఫోన్ చేయడం. "అమ్మా, నేను కలెక్టర్ కాబోతున్నాను" అని చెప్పిన అతని, తరువాతి పని, తన అసలు పేరు చుట్టుపక్కల నలుగురికీ చెప్పడం. దాదాపు మూడేళ్ల పాటు శుభమ్ గా ఆ వీధిలోని ప్రతి ఒక్కరికీ పరిచయమున్న ఆ యువకుడి అసలు పేరు అన్సర్ షేక్. ఎంతో బుద్ధిమంతుడిలా తమ మధ్య ఉండి, నిత్యమూ పుస్తకాలతో కుస్తీ పడుతూ, ఐఏఎస్ పాసయ్యాడని అందరూ అభినందిస్తున్న వేళ, అప్పటికీ నిజం దాచాల్సిన అవసరం లేదని భావించిన అన్సర్, తన అసలు పేరు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. తనెందుకు తప్పుడు పేరుతో తిరగాల్సి వచ్చిందో చెప్పి, క్షమించమని అడిగి, తిరిగి అందరితో కలిసిపోయాడు. ఓ ఆటోరిక్షా డ్రైవర్ కుమారుడిగా తన ఐఏఎస్ కలను నెరవేర్చుకునేందుకు పడ్డ కష్టాలను అందరితో పంచుకున్నాడు. "నేను 2013లో ఐఏఎస్ సాధించాలన్న ఏకైక లక్ష్యంతో పుణెకు వచ్చాను. ఎక్కడైనా పేయింగ్ గెస్ట్ గా ఉండాలని అనుకున్నాను. కానీ నా పేరు ఆ అవకాశాన్ని దూరం చేసింది" అని సివిల్స్ లో 361వ ర్యాంకు పొందిన అన్సర్ వ్యాఖ్యానించారు. తన పేరు చెప్పగానే, ముఖంమీదే తలుపులు మూసేసేవారని, చివరికి ఏం చేయాలో అర్థం కాక, శుభమ్ గా పేరు మార్చుకుని ఓ ఇంట ఆశ్రయం పొందానని చెప్పుకొచ్చారు. అవమానాలను ఎదుర్కొన్న తాను, తన లక్ష్యానికి చేరువ కావాలన్న కోరికతో, గుర్తింపును దాచుకోవాల్సి వచ్చిందని, తనకు ఎదురైన అనుభవాల పట్ల కోపం లేదని, ఈ పరిస్థితిని మార్చేందుకు తనవంతు కృషిని చేస్తానని అంటున్న అన్సర్ కు ఆల్ ది బెస్ట్.

  • Loading...

More Telugu News