: జగన్ జలదీక్షలు కేసీఆర్ వ్యూహంలో భాగమే: రేవంత్ రెడ్డి
తెలంగాణలోని ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైకాపా అధినేత జగన్ చేపడుతున్న దీక్షలన్నీ కేసీఆర్ వ్యూహంలో భాగమేనని తెలంగాణ తెలుగుదేశం నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒకవైపు ప్రాజెక్టు కాంట్రాక్టులను తన వారికి ఇప్పించుకుంటూ, మరోవైపు వాటిని అక్రమ ప్రాజెక్టులని చెప్పి ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టులు అక్రమమని భావిస్తే, వెంటనే కాంట్రాక్టులు వదులుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీని నిందిస్తూ, రెండువైపులా లాభపడాలన్నది కేసీఆర్, జగన్ ల అభిమతంగా కనిపిస్తోందని రేవంత్ దుయ్యబట్టారు. ఏపీలోని తెలుగుదేశం నేతలు వారి ప్రాంత ప్రయోజనాలకు, తెలంగాణలోని నేతలు తెలంగాణ ప్రయోజనాలకు పాటుపడతారని తెలిపారు.