: వైద్య సేవలు అందిస్తున్న ప్రపంచ 'అందవికార' శునకం... యూకేలో హీరో అవార్డ్ గెలిచింది!
ప్రపంచ అత్యంత అందవికారమైన కుక్కగా 2012లో కిరీటాన్ని దక్కించుకున్న కుక్క ‘మగ్లీ’.. తాజాగా లండన్ లో హీరో అవార్డ్ అందుకుంది. 12ఏళ్ల వయసుగల ఈ చైనా శునకం థెరపీ డాగ్ గా తాను అందించిన సేవలకు గానూ ఈ అవార్డ్ దక్కించుకుంది. ఆరేళ్లుగా మగ్లీ వాలంటరీ థెరపీ పెట్గా సేవలందిస్తోంది. పిల్లలకు చదువు పట్ల ఆసక్తి కలిగించడం, శారీరక వైకల్యాలతో బాధపడుతోన్న వయోజనుల్లో చాలెంజ్‌లను స్వీకరించే అంశాలను తన చేష్టలతో చెప్పడం వంటి ప్రోగ్రాముల్లో ‘మగ్లీ’ ఓ బ్రిటీష్ సంస్థ సాయంతో పాల్గొంటోంది. దీంతో లండన్ లో ఇటీవలే నిర్వహించిన సూపర్ డాగ్స్ అవార్డ్స్‌లో మోస్ట్ హీరోయిక్ హౌండ్ అవార్డును సాధించింది. మగ్లీ ప్రపంచ అత్యంత అందవికారమైన కుక్కగా 2012లో కిరీటాన్ని సాధించడమే కాదు, 2005లోనూ బ్రిటన్ అత్యంత అందవికార శునకంగా కూడా అవార్డు పొందింది. రీడ్ టూ డాగ్స్ స్కీంలో భాగంగా బ్రిటన్ సంస్థ నిర్వహిస్తోన్న ప్రోగ్రాముల్లో మగ్లీ చేసే పని ఏంటంటే.. గట్టిగా మాట్లాడలేకపోవడం, అందరి ముందు చదవలేకపోవడం వంటి రుగ్మతలతో బాధపడుతోన్న పిల్లలతో కాసేపు గడిపి తన చేష్టలతో వారిలో ఓ నమ్మకాన్ని నింపుతుంది. అంతేకాదు జంతువులంటే భయపడిపోయే పిల్లలను.. జంతువులను ఫ్రెండ్స్‌గా చేసుకుని వారి ఒత్తిడి తగ్గించుకొనేలా చేస్తుంది. అంగవైకల్యంతో బాధపడుతోన్న పిల్లల్లో కూడా ఈ శునకం కాన్ఫిడెన్స్ నింపుతుంది. మగ్లీ ఇంగ్లీష్ చానల్స్ నిర్వహించే టీవీ షోల్లోనూ అనేక సార్లు పాల్గొంది.