: అన్నాడీఎంకే రూ. 1500, డీఎంకే రూ. 1000 ఇచ్చి తమిళ నటిని ప్రచార చిత్రానికి బుక్ చేసేశారు!
నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన తమిళనాడులో రెండు ప్రధాన పార్టీల ప్రచారం మధ్య ఓ సీనియర్ తమిళ నటి ఇరుక్కుపోయారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ మీడియా ప్రచారం కోసం ఒకే నటిని వాడుకోవడంతో ఈ ప్రకటన సైతం వివాదాస్పదమైంది. ఈ నటి పేరు కస్తూరి (64). ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సహాయనటిగా నటించారు. ఈమె వయసును దృష్టిలో ఉంచుకుని అధికార అన్నా డీఎంకే ఓ ప్రకటన రూపొందించింది. "నాకు కన్నబిడ్డలే తిండి పెట్టలేదు. అన్నం పెట్టింది విప్లవనాయిక అమ్మనే" అని చెప్పించారు. అమ్మ క్యాంటీన్లను చూపుతూ, ఓట్ల కోసం తయారు చేసిన ఈ ప్రచార చిత్రంలో నటించినందుకు ఆమెకు రూ. 1500 ఇచ్చారట. ఇక ఆపై డీఎంకే వారు వచ్చి తమ ప్రకటనలో నటించాలని కోరారు. ఆమె వారించినా వినకుండా తీసుకు వెళ్లి "గాల్లో తిరిగే వారికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయి? ప్రజల గురించి పట్టించుకోని ప్రభుత్వం ఎందుకు? చాలమ్మా.." అంటూ చెప్పించి, ఓ రూ. 1000 చేతిలో పెట్టి పంపారు. ఇప్పుడీ రెండు ప్రకటనలూ ఒకదాని తరువాత మరొకటి టీవీ చానళ్లలో విస్తృతంగా ప్రసారమవుతున్నాయి. రెండు ప్రకటనల్లో నటించిన కస్తూరి మాత్రం, తనకే పాపం తెలియదని, తొలుత జయలలిత యాడ్ లో నటించిన తనను బలవంతంగా తీసుకెళ్లి రెండో యాడ్ తీశారని ఆరోపించారు. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని చెప్పారు. ఈ రెండు యాడ్లనూ కలిపి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో ఇప్పుడవి దేశవ్యాప్తంగా వైరల్ అవుతూ, తమిళ రాజకీయాలపై కామెంట్లు మీద కామెంట్లు తెస్తున్నాయి.