: చెన్నై ఎమ్యూజిమెంట్ పార్క్ 'కిష్కింద'లో కుప్పకూలిన 'డిస్కో డ్యాన్సర్'... ఒకరు మృతి
చెన్నై సమీపంలోని ప్రముఖ ఎమ్యూజిమెంట్ పార్క్ కిష్కిందలో 'డిస్కో డ్యాన్సర్' రైడ్ ట్రయల్ నిర్వహిస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గతేడాది చెన్నైని వరదలు ముంచెత్తిన తరువాత కిష్కింద మూతపడింది. తిరిగి దాన్ని తెరిపించే ప్రయత్నాల్లో భాగంగా పలువురు కార్మికులు ఒక్కో రైడ్ ను పునర్నిర్మించి ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఓ టీకప్పు ఆకారంలో ఉండే బేస్ చుట్టూ తిరుగుతుండగా, అది 'కొలంబస్' తరహాలో ఉయ్యాల మాదిరిగా డిస్కో డ్యాన్సర్ ఊగుతూ ఉంటుంది. జెయింట్ వీల్ కన్నా మంచి అనుభూతిని డిస్కో డ్యాన్సర్ ఇస్తుందని సందర్శకులు దీని పట్ల అమిత ఆసక్తిని చూపేవారు. కాగా, ఈ తాజా ప్రమాదంతో డిస్కో డ్యాన్సర్ రైడ్ ప్రజలకు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేవు.