: ముస్లింలపై నా వ్యాఖ్యలు ఓ సలహా మాత్రమే: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికల రేసులో ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఉగ్రవాదులను దేశంలోకి రాకుండా అరికట్టే క్రమంలో ముస్లింలకు ఇమ్మిగ్రేషన్ బ్యాన్ చేయాలని గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గతంలో తాను చేసిన పలు వ్యాఖ్యల పట్ల పలుసార్లు మాట మార్చిన ట్రంప్ ముస్లింలపై చేసిన వ్యాఖ్యల పట్ల కూడా తాజాగా మాట మార్చారు. ముస్లింలు అమెరికాలోకి ప్రవేశించడాన్ని ఆపేయాలంటూ తాను చేసిన వ్యాఖ్యలు కేవలం తన సలహా మాత్రమే అని ట్రంప్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రదాడుల సమస్య ఉందని, అమెరికాలో ముస్లింలకు ఇమ్మిగ్రేషన్ బ్యాన్ విధిస్తే.. అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుందన్నారు. అమెరికా ఎన్నో సమస్యల్ని ఎదుర్కుంటోందని, అయితే ముస్లింలకు ఇమ్మిగ్రేషన్ బ్యాన్ అంశాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదని ట్రంప్ అన్నారు. సమస్యల దృష్ట్యా ముస్లింలపై ఆ వ్యాఖ్య చేశానని, ఇది కేవలం తన సలహా మాత్రమేనని వ్యాఖ్యానించారు.