: షిర్డీ సాయిబాబా దేవుడని నిరూపించలేకపోతే నా పీఠాన్ని వదిలేస్తా: ద్వారకా పీఠాధిపతికి రమణానంద మహర్షి సవాల్


షిర్డీ సాయిబాబా దేవుడని తాను నిరూపిస్తానని సిద్ధ గురు రమణానంద మహర్షి అన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆయన ఒక సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రమణానంద మహర్షి మాట్లాడుతూ, సాయిబాబా దేవుడు కాదంటూ గుజరాత్ లోని ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఆయన అమాయకత్వానికి నిదర్శనమన్నారు. షిర్డి సాయిబాబా గురించి ఆ స్వామిజీకేమీ తెలియదని, అందుకే అలా మాట్లాడుతున్నారన్నారు. వంద ప్రమాణాలతో షిర్డి సాయిబాబా దేవుడని తాను నిరూపిస్తానని, ఒక్క ప్రమాణంతో ఆయన దేవుడు కాదని స్వామి స్వరూపానందేంద్ర నిరూపించగల్గుతారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ వాదనలో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి గెలిస్తే తన మహా పీఠాన్ని ఆయనకు ఇస్తానని, ఒకవేళ ఆయన ఓడిపోతే ద్వారకా పీఠాన్ని తనకు ఇవ్వాలంటూ రమణానంద మహర్షి ఛాలెంజ్ విసిరారు. ఈ పందెంలో ఇదే సవాల్ అని అన్నారు. ఈ విషయమై తనతో వాదనకు రావాలంటూ స్వామి స్వరూపానందేంద్రకు ఆహ్వానం పంపామని, హైదరాబాద్ కు రమ్మనమని కోరామన్నారు. అయితే, వారు రాలేదని, అందుకు కారణం వారికి బాబా అంటే ఏమిటో తెలియకపోవడమేనని అన్నారు. షిర్డీ సాయిబాబాపై స్వామిజీ చేసిన 24 ఆరోపణలను చూస్తే... సామాన్యమానవుడికి ఉన్న ఙ్ఞానం కూడా ఆయనకు లేదని ఆరోపించారు. అంతకుముందు ‘నాతో వాదనకు దైవశక్తి ప్రదర్శనకు సిద్ధమా?’ అనే పుస్తకాన్ని ఆయన ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సభకు హాజరైన భక్తులకు ఈ పుస్తకాలను ఉచితంగా పంచిపెట్టారు. కలియుగం ప్రారంభమైన తర్వాత ఐదువేల సంవత్సరాల తర్వాత ఒక మహితాత్ముడు అవతరిస్తాడని గ్రంథాల్లో ఉందని, ఆ మహితాత్ముడెవరో కాదని, షిర్డీ సాయిబాబాయేనని అన్నారు. ఈ సందర్భంగా మెహెర్ బాబా, రామకృష్ణ పరమహంస, వివేకానంద మొదలైన మహాత్ములు షిర్డి సాయిబాబా జగద్గురువులు అని ప్రస్తావించిన సంఘటనలను రమణానంద మహర్షి గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News