: ఇది జంగిల్ రాజ్ అయితే... మరి అక్కడ అవి ఏంటి?: బీజేపీని నిలదీసిన లాలూ కుమారుడు
బీహార్ లో జేడీ(యూ) ఎమ్మెల్సీ రమాయాదవ్ కుమారుడు రాఖీ యాదవ్ నడి రోడ్డుపై యువకుడిని తుపాకీతో కాల్చిచంపి కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై బీహార్ ప్రతిపక్ష పార్టీ (బీజేపీ) ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. బీహార్ లో జంగిల్ రాజ్ నడుస్తోందని ఆరోపించింది. ప్రతిపక్షాల విమర్శలపై డిప్యూటీ సీఎం, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు నిప్పులు చెరిగారు. బీహార్ లో జంగిల్ రాజ్ అని విమర్శిస్తున్న ప్రతిపక్షానికి ఢిల్లీలో ఇంతకంటే ఘోరమైన రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, వాటిపై ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. అలాగే మధ్యప్రదేశ్ లో వ్యాపమ్ కుంభకోణం కారణంగా పలువురు హత్యలకు గురవుతున్నారని, అవి జంగిల్ రాజ్ కావా? అని అడిగారు. పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడి, రాజస్థాన్ లో జాట్ల ఆందోళన సందర్భంగా జరిగిన అత్యాచారాలు జంగిల్ రాజ్ కాదా? ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై బీజేపీ ఇలాంటి ఆరోపణలు ఎందుకు సంధించడం లేదని ఆయన నిలదీశారు.