: ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకోవాలి: హోదాపై ప్రత్తిపాటి
గత ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై బీజేపీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై తమ పార్టీ ప్రయత్నిస్తూనే ఉందని చెప్పారు. బీజేపీ కూడా ప్రత్యేక హోదాపై గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ శాసనసభలో తాము తీర్మానాన్ని ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజలు ప్రత్యేక హోదాపై ప్రయత్నిస్తోన్న తమ ప్రభుత్వ విధానాన్ని అర్థం చేసుకుంటారని వ్యాఖ్యానించారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు మోదీ ప్రభుత్వంతో ఆయా సందర్భాల్లో చర్చలు జరుపుతూనే ఉన్నారని తెలిపారు.