: ‘హోదా’పై దీక్ష విరమించిన చలసాని.. ఓయూ విద్యార్థుల సంఘీభావం సంతోషకరమని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్షను చేస్తోన్న ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ కొద్దిసేపటి క్రితం దీక్షను విరమించారు. హైదరాబాద్ ఆసుపత్రిలో దీక్షను కొనసాగిస్తోన్న చలసాని వద్దకు చేరుకున్న ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి.. చలసాని దీక్షను విరమింపజేశారు. ఈనెల 18న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చలసాని శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. అంతకు ముందు ఓ తెలుగు మీడియాతో మాట్లాడిన చలసాని... తన దీక్షకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తెలిపిన సంఘీభావం సంతోషకరమని వ్యాఖ్యానించారు. కేంద్రం విభజన హామీలు అమలు చేయాల్సిందేనని, అప్పటి వరకు తాను పోరాడుతూనే ఉంటానని చెప్పారు.